Thursday, 14 August 2014

అహోబిలం

అహోబిలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలం నందు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలం నందు వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించినాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబిల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో కలదు. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. దివ్య తీర్ధంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరప భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. అవతార కథ సాగిన ప్రదేశమే అహోబలక్షేత్రం. దిగువ అహోబలం నందు వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవసించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి కలవు. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్టించి ఆరాధించినాడు కావున ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం కలదు. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వసం పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచినారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15 శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్ధం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి. తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43 పీఠాధిపతి పంచసంస్కారాలలో 44 పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్. లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపం నందు వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.
అహోబిల మహత్యం
పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే అహోబిలక్షేత్రము. స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది.
పార్వేట
అహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వాఇస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి ప్రప్రధమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. నాటి నుండీ నాటివరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము. తిరుమలలో కూడ శ్రీ వారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. అటు పిమ్మట బ్రంహ్మోత్సవాలు జరిగిగరుడోత్సవంతో అనగా మర్చి 17 వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామి వారుతన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో నలబైదు రోజులు సంచరిస్తాడు. పర్వేట ఉత్సవాలు గ్రామాలలో నలబైదు రోజులు జరుగుతాయి. నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికి పండగే. అన్ని వేడుకలె. స్వామి వారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది విధంగా స్వామి వారి సేవలో తరిస్తున్నారు.
ఎగువ అహోబిలము
ఎగువ అహోబిలం నందు వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఎగువ అహోబిల ఆలయము కలదు.

దిగువ అహోబిలము
శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.


No comments:

Post a Comment