Thursday, 14 August 2014

మహాశివుని మెప్పించి రావణాసురుడు సంపాదించిన “శివుని ఆత్మలింగం” ( GOKARNA )

రావణాసురుడు శ్రీ మహాశివుని మెప్పించి, హిమాలయాల లోని “కైలాస పర్వతం” నుండి సంపాదించిన “శివుని ఆత్మలింగం”.. ఇప్పటి .. శ్రీ “గోకర్ణ”(గోకర్ణం) మహా పుణ్య క్షేత్రంలో వుంది.!!
”గో” అంటే “ఆవు” – “కర్ణ” అంటే “చెవి” అని అర్ధం.! “శివుని” “ఆత్మలింగం” - “ఆవు చెవి” ఆకారంలో వుండటంవల్ల, అది వున్న ప్రదేశం కూడా “గోకర్ణ”గా పిలవబడుతోంది
ఈ “గోకర్ణ గ్రామం” కర్ణాటక రాష్ట్రం, ఉత్తర కన్నడ జిల్లాలో, అరేబియా సముద్ర తీరంలో ఉన్నది. బెంగళూరు కి (545 కి.మి.)దూరంలో, ఉత్తర కన్నడ జిల్లా “కార్వార్” కి 55 కి.మి దూరంలో ఉన్నది. ఈ గోకర్ణ “శైవ క్షేత్రం”గా చాలా ప్రసిద్ధి చెందినది. దీనినే “దక్షిణ కాశీ”గా కూడా పిలుస్తారు.ఈ క్షేత్రమే “ఏడు ముక్తిక్షేత్రం”లలో ఒకటిగా, “ముక్తిస్థలం” గా హిందువులు ఇక్కడ పితృ తర్పణాలు కూడా సమర్పిస్తారు.(కర్నాటక రాష్ట్రం లోని మిగిలిన ముక్తిస్థలా లు – ఉడిపి , కొల్లూర్, కొక్కే సుబ్రహ్మణ్య ,కుంబసీ ,కోడేశ్వర మరియు శంకరనారాయణలు). ఈ గ్రామములో అత్యంత సుందరమైన బీచ్ లు కూడా వున్నాయి. ఈ గ్రామం “గోవా” దగ్గరగా ఉండడం, బీచ్‌లు సుందరంగా ఉండడంతో అంతర్జాతీయ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది. !!
ఇతిహాసం ప్రకారం, “రావణాసురుడు” శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి,శివుని మెప్పించి, “ఆత్మలింగాన్ని” భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం “స్వభావం” ప్రకారం “భూమిమీద” ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ “స్థాపితం” అయి, అక్కడ నుండి తిరిగి “ఎత్త శక్యం కాదని” మహా శివుడు చెబుతాడు.ఇక దేవతలు, రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి, విష్ణువును వేడుకొనగా, విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి, సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.
ఈ విషయం తెలుపుకొన్న నారదుడు “వినాయకుని” వద్దకు వెళ్ళి, రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం గ్రహించి,దానిని “భూమి మీద పెట్టాలని” కోరతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు,రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి “బ్రాహ్మణ వేషంలో” వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే,రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన సమయమై నందున,ఆ లింగాన్ని “పట్టుకొనవలసింది”గా కోరుతాడు. అది విన్న వినాయకుడు,లింగం “చాలా బరువు” ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేక పోయినప్పుడు “మూడు” సార్లు పిలుస్తానని, ఆ పిలుపుల లోగా రావణాసురుడు రాకపోతే, లింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.
రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు. రావణాసురుడు సంధ్యవార్చు కోవడానికి అటు వెళ్ళగానే, గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు, వెంట వెంటనే “మూడు సార్లు” పిలుస్తాడు. సంధ్యవార్చు సమయం “మధ్యలో” ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే, వినాయకుడు లింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు . రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి “నెత్తిమీద” మొట్టుతాడు, గణపటి నెత్తికి “గుంట” పడుతుంది. అట్లా వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని భూమిమీద పెట్టిన స్థలంమే ఈ” గోకర్ణ” పుణ్యక్షేత్రం.
ఇక విష్ణువు తన మాయని తొలగించగా, వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన, రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ,ఆత్మలింగాన్ని తన “చేతులతో” పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం లోనే ఆత్మలింగం “లింగ రూపం” కోల్పోయి, చేతులతో గట్టిగా “పైకి లాగటం (పీకటం) వల్ల,” పొడవుగా సాగి”– “అవు చెవి”రూపం సంతరించుంకుంది. ఈ ఆత్మలింగమే “ఐదు భాగాలు”గా విడిపోయి “ఐదు ప్రదేశాలలో” పడినట్లు స్థల పురాణం చెపుతోంది.
ఈ ఆత్మలింగం “మొదటి” బాగమే “గోకర్ణం” లో “మహాబలేశ్వర” లింగంగా పిలవబడుతూ “ఆవు చెవి” రూపంలో వున్నది. ఆత్మలింగం” రెండో” భాగం, లింగం పైనున్న “కవచం” విచ్ఛిన్నం అయి, గోకర్ణకు సుమారు 70 కి.మీ. దూరంలో వున్న“సజ్జేశ్వర” అనే ప్రదేశంలో పడుతుంది.దీనినే “సిద్ధేశ్వర” లింగ అని కూడా పిలుస్తారు. ఆత్మలింగం “మూడో” భాగం, గోకర్ణకు దక్షిణాన సుమారు 45 కి.మీ.దూరంలో వున్న“ధారేశ్వర్” లో పడినట్లు తెలుస్తోంది.ఇక “లింగంపై” నున్న “నాలుగవ” భాగంగా, లింగం పైన వున్న“మూత”ను “తొలగించి” విసిరి వేస్తే అది గోకర్ణకు 60 కి.మి దూరంలో ఉన్న “గుణేశ్వర”లో పడుతుంది.దీనినే “గుణవంతేశ్వర” లింగ అని కూడా పిలుస్తున్నారు. లింగం పైనున్న “ఐదవ” భాగం,“వస్త్రాన్ని” విసిరివేస్తే అది “కందుక పర్వతం”పై నున్న “మృదేశ్వర” లో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో “మురుడేశ్వర”గా మారింది.ఈ మురుడేశ్వర క్షేత్రం గోకర్ణ కు సుమారు 70 కి.మీ.దూరం లో వుంది. ఇక్కడే సముద్రపు ఒడ్డున అత్యంత సుందరమైన పెద్ద శివ విగ్రహం (123 ft. ఎత్తు ) వున్నది.
గోకర్ణ లోని శివభక్తులు ఈ మహాబలేశ్వరుని ఆత్మలింగాన్ని ” శాలిగ్రామ పీఠం” లోని “మధ్య” భాగంలో వున్న “గుండ్రని రంధ్రం” లోనుండి తమ చేతులతో తాకుతారు.ఈ మహాబలేశ్వరుని ఆలయానికి ప్రక్కగా “గణపతి”ఆలయం కూడా ఉంది. రావణాసురుడు“తలపై” మొట్టాడు అనడానికి “గుర్తుగా” గణపతి “మాడు” మీద “గుంట”గా ఉంటుది. ఈ గణపతిని అందరు సృశించవచ్చు, గణపతికి అభిషేకం కూడా స్వయంగా చేయవచ్చు.
శ్రీ మహాబలేశ్వరుడి దేవాలయానికి దగ్గరలొనే “భద్రకాళి” దేవాలయం ఉన్నది. భద్రకాళిని “అన్నపూర్ణమ్మ” తల్లితో సమానంగా భావిస్తారు. ఆవిడ చేతిలో “తక్కెడ”(త్రాసు) సరిసమానంగా ఉండకుండా “హెచ్చుతగ్గులు”గా వుంటుంది. ఈ గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక “తటాకం( కోనేరు) ఉంది దీనినే “కోటీ తీర్థ”గా , “గంగ”తో సరి సమానంగా ఆ ప్రాంతీయులు భావిస్తారు. గతించిన తమ పెద్దలకు ఇక్కడ “ పితృ తర్పణాలు” కూడా సమర్పిస్తారు.
గోకర్ణ గ్రామానికి 10 కి.మి. దూరంలో మంగళూరు-ముంబాయి కొంకణ్ రైల్వే లైనులో “గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్” ఉన్నది. కాని ఈ గోకర్ణ రైల్వే స్టేషన్ లో “ప్యాసింజర్ రైళ్లు” మాత్రమే నిలుస్తాయి.“ఎక్స్‌ప్రెస్‌”రైళ్లు గోకర్ణకు 23 కి.మి. దూరంలో ఉన్న”కుంటా”, 25 కి.మి. దూరంలో ఉన్న“అంకోలా”, మరియు ఉత్తర కన్నడలో “కార్వార్లో” ఆగుతాయి.ఇక్కడకు బస్సు సౌకర్యంకూడా వుంది. హొబ్లీ నుండి,హంపినుండి గోకర్ణకు తరచూ బస్సులు ఉన్నాయి. గోవా నుండి ప్రొద్దున్న 8 గంటలకు సరాసరి గోకర్ణకు చేర్చే బస్సు ఉన్నది (5 గంటల ప్రయాణం). మంగళూరు (252 కి.మి.) నుండి ఉదయం 7 గంటలకు బస్సు ఉన్నది. బెంగళూరు నుండి పగలు 9 గంటలకు, మైసూర్ నుండి పగలు 6 గంటలకు గోకర్ణకు సరాసరి బస్సులు నడుస్తాయి.

ఇదండీ .. శ్రీ గోకర్ణ మహా పుణ్య క్షేత్ర కధ ..! మీరు కూడా ఆయన దర్శనాన్ని కోరుకుంటున్నారు కదా.. !! శుభం భుయాత్ ..!!




No comments:

Post a Comment